సింగినాథం - శ్రీరామరాజ్యం

ఒరే సింగినాథం, రామరాజ్యం సినిమా బాగుందిట, చూసొద్దాం పద

సింగినాథం : ఏంటీ చూసొచ్చేది, ఒక్కసారికే తల బొప్పి గడితేనూ...ఇంక డబ్బులు తగలెయ్యలేన్నేను.

అదేంట్రా, అంత మాటనేసావ్? తెలుగుదనం, సంస్కృతి కలగలిసి సహజత్వానికి దగ్గరగా బ్రమ్మాండంగా ఉందని జనాలు చూసి తెగ రాసేస్తుంటేనో...

సింగినాథం : ఏడిసారు, చూట్టం సరిగ్గా తెలిస్తేగా.... అయినా ప్రతివాడూ సినిమా చూసేవాడైతే ఇలానే ఉంటుంది...

వార్నీ తస్సాదియ్యా, సినిమా తీయడానికే క్వాలిఫికేషన్ అనుకున్నా చూట్టానిక్కూడా ఉండాలిట్రా?

సింగినాథం : కాదేంటీ, ఇదీ కవిత్వం టైపే...కవిని అర్థం చేసుకునే స్థాయికి పాఠకుడు ఎదగాలి ఎదగాలి అని కవులు పేట్రేగి పోవట్లా, అలానే సినిమా చూసేవాడికి తగ్గట్లు సినిమా తీసేవాడు దిగజారాలి దిగజారాలి  అని జనాలు డిమాండ్ చెయ్యటంలో తప్పేంటిట.. కాదు నేను దిగజారనంటే ఇదిగో ఇలానే అనుభవిస్తారు మరి.. ఓ గొప్ప కళాఖండం అని తీసి ఏం ఘనకార్యం సాధించార్ట... పెట్టిన డబ్బులు కూడా రావటం కష్టమైతేనో..

అద్సరే, ఇక్కడంటే ఏదో మాసు జనాలనుకుందాం, మరి ఆ అమెరికా, లండను వాళ్ళు రివ్యూలు చదివిగానీ సినిమాలు చూడని టైపు కదట్రా, మరి వాళ్ళకేం నచ్చలేదో పాపం. రివ్యూలు గొప్పగా ఉన్నా అక్కడా పెద్దగా చూట్టానికి రాలేదుట. అవకాశమొస్తే చాలు తెలుగు, సాహిత్యం, సంస్కృతి గంగలో కలిపేస్తున్నాయ్ మన నేటి దిక్కుమాలిన తెలుగు సినిమాలు అంటారుగా చిత్రం గాకపోతేనో.

సింగినాథం : అంటారంటారు.. ఇప్పటికీ అంటారు. అయినా అసలు ఈ సినిమాలో ఏం ఉందని చూడమంటారు?

అంటే ఏమీ లేవంటావా సింగినాథం? అసలు నీ అభిప్రాయం ఏంటో చెప్దూ..

సింగినాథం: ఎన్నని చెప్పమంటారండీ...ఎన్నని...అన్నీ లొసుగులే...ఆనాటి లవకుశ ఎక్కడ...ఈ సినిమా ఎక్కడ?

ఒరే నాన్నా.. పోలికలొదిలేసి ఇదెలా ఉందో చెప్పెహ...

సింగినాథం: విడిగా చూస్తే బాగున్నట్లేఉంది... కానీ అలా చెప్పాలనిపించట్లా.... అయినా అదేమన్నమాట, పోల్చటం నా జన్మ హక్కు. పోల్చకపోతే నాకు ఈ సినిమాలో పెద్దగా బొక్కలు కనపడట్లేదెహ.

వార్నీ సింగినాథం, అసలు నిన్ను ఈ సినిమాని ఆనాటి లవకుశతో ఎవడు పోల్చమన్నాడ్రా? ఆ మాటకొస్తే అసలు ఇవ్వాల్టి నిన్ను ఆ లవకుశ కాలం నాటి మీ తాతతో పోలిస్తే నీ బతుకెంత నీచం అంటావ్?

సింగినాథం: ఏంది అన్నాయ్ ఇది, నీచం గీచం అంటూ నన్ను విమర్శిస్తే సహించేది లేదు, విమర్శించే హక్కు కూడా నా ఒక్కడిదే.

అసలు నీ దృష్టిలో ఈ సినిమాలో లోపాలు చెప్పి ఎలా సరిచేస్తే డబ్బులొచ్చేంత హిట్టవుతుండో చెప్పరా?

సింగినాథం: ముందుగా చెప్పుకోవాల్సింది సహజత్వం గూర్చి, అసలు సినిమాలో సహజత్వం ఏదీ? మొత్తం మూడు గంటల నిడివి గల సినిమాలో ఓ నిముషం కూడా నారి/నాభి రసవత్తరంగా చూపించరేం మా రాఘవేంద్రరావు  సినిమాలోలాగా? అదీ సహజత్వం అంటే. ఉన్నదాన్ని దాచటం తప్పు, అసహజం కూడానూ. అయినా ఆ రాముడేంటీ, ఆ ముడతలు పడ్డ ఆ చర్మమేంటి? ఆ చర్మాన్ని ఇస్త్రీ చేసి చూపించొచ్చుగా? ఆ సెట్టింగులేంటయ్యా కృత్రిమంగా....లక్షలు పోసి చేస్తే ఏంటీ , కోట్లు పోసి చేస్తే నాకేంటి? నాకెందుకో అవి ప్లాస్టిక్ ముక్కల్లా అనిపించాయ్. అదేంటో అదే పాత లవకుశలో నాకు నిజంగా ప్లాస్టిక్కుతో చేసిన ముక్కలు చాలా సహజంగా అనిపించాయ్. ఎందుకంటావ్?

తిమ్మిరనుకుంటా. దీన్నే ప్రెజుడిస్ అని కూడా అంటారు. తిమ్మిరెక్కితే అన్నీ అలానే కనిపిస్తాయిరా సింగినాథం. చూడబోతే నీకు నటనతో కంటే నటన కాని వాటితోనే సమస్యలున్నట్లున్నాయ్.

సింగినాథం: అసలు పద్యాలేవీ? నాకు రోజుకు రెండు పద్యాలు చదివితే గానీ నిద్దరపట్టదు తెలుసా. నీమీదొట్టు. మూడుగంటలు కాకపోతే ముప్పై గంటలైనా తీసి పద్యాలు పెట్టాల్సింది. అప్పుడు డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడేవి.

చాల్లే బడాయి, ఈ మాత్రం దానికే జనాలు రాకపోతే, ఇంకా నీ లాంటి వాళ్ళ కోసం పద్యాలు కూడా పెడితే ఆ మిగిలిన వాళ్ళలో ఎంతమంది వచ్చే వాళ్ళంటావ్?

సింగినాథం: అదేమరి, నిజం చెబితే నిష్టూరంగానే ఉంటుంది. అసలు ఒక్క ఐటం సాంగు అన్నా నేటి నేటివిటీకి తగ్గట్లు లేకపోవటం మరో సమస్య. శ్రీరాముడి పట్టాభిషేక సభలో ఓ నర్తకి చేత ఓ ఐటం సాంగ్ చేరిస్తే నా సామిరంగా.. ఈ పాటికి 50 కోట్ల షేర్ వసూల్చేసేది ఈ సినిమా. అట్లానే, ఆ చాకలి తిప్పడు వాళ్ళ బస్తీలో ఓ మాస్ సాంగ్ ఇరికించే అవకాశం కూడా బాపు గారు వృధా చేసారు. ఇంక డబ్బులేక్కడొస్తాయ్... అర్ధం చేసుకోరు...అలా చేస్తే.... ఆఖరికి మన బస్తీల్లో కూడా తెగ ఆడేది. తెల్సా? అదే మీతో సమస్య, షుగర్ కోటింగ్ వేసిన చేదు బిళ్ళలా ఉండాలయ్యా?

ఒరే సింగినాథం, ఏం చెప్పావ్రా, షుగర్ కోటింగ్ వేసిన చేదు బిళ్ళలా ఉండాలా? అంటే రామాయణం ఓ చేదుబిళ్ళ, దానికి ఐటం సాంగ్ ఓ షుగర్ కోటింగా. వాహ్వా..వాహ్వా.. నీ మా గొప్ప విమర్శ బాపు గారికి చేరుస్తా గానీ, కానీ మరి మాసు జనాలకి ఈ పద్యాలు, సాత్త్వికత అంటూ ఇలా మీరు చెప్పినవన్నీ తీసి చూపిస్తే నిజంగా చూస్తారంటావా మరి?

సింగినాథం : ఆ తీస్తాడో, చూస్తారో నాకెందుకు? ఓ (కు)విమర్శకుడిగా ఓ నాలుగు ఉచిత సలహాలు, అర్థంలేని మాటలు రాయటమే నా పని.

బాగుంది. అద్సరే, మన ఎన్నారైలు కూడా ఇలా వెన్నుపోటు పొడవటానికి గల కారణమేమంటావ్?

సింగినాథం:  ఆ మీ పిచ్చి గాకపోతే, సభామర్యాద కోసం వంద చెప్తారు. అవన్నీ నమ్మి పారెయ్యటమేనా? ఎన్నారై అయితే ఏంటట, వాళ్ళు మన తెలుగు సభ్య సమాజానికి చెందినవాళ్ళు కాదా? వాళ్ళకీ చిన్న చిన్న కోరికకలుండవా? వాళ్ళ హక్కుల్ని హరించకండయ్యా బాబూ.. ఓ ఐటం సాంగ్, ఓ చిన్న ఎక్స్పోజింగ్ కోరుకోవటం తప్పా? ఏం పాండురంగడిలో లేవా ... అన్నమయ్యలో లేవా? ప్రేక్షకుల స్థాయికి దిగకుండా సినిమా చూడాలంటే ఎలా బాబూ? దిగజారండయ్యా, దర్శకులూ దిగజారండి. మీరు కళ్ళు మూసుకు తియ్యండి, మేము కళ్ళు తెరుచుకు చూస్తాం.

ఒరే సింగినాథం, ఏం చేస్తాం,  పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అని ఊరికే అన్నారా. ఏమైనా ఆ నిర్మాత డబ్బులు ఆయనకొస్తే చాలు. ఏదో అనుకున్నా గానీ నువ్వో అసామాన్యుడివిరా? నా పిచ్చ కాకపోతే, ఇంకా తెలుగు, భాష, సంస్కృతి అని వేలాట్టం అనవసరం అని చాలా చక్కగా కళ్ళు తెరిపించావ్. ఈ దెబ్బకి మళ్ళీ ఇంకోడు ఇలాంటి సినిమాల జోలికొస్తే ఒట్టు. 


శ్రీరామరాజ్యం - ఓ చక్కని దృశ్యకావ్యం

ఓ రకంగా ఈ సినిమా నాకొక పెద్ద షాకే. బాపు గారి సినిమా అని వెళ్ళిన నాకు, బాలయ్య తన నటనతో ఆశ్చర్యపరిచాడు. "సింహా" సినిమాకి బాలయ్య ఉత్తమనటుడి ఎంపికని తూర్పారబట్టిన  నాకు అదే బాలయ్య ఈ సంవత్సరం ఉత్తమ నటుడిగా నంది అవార్డు తనకి తప్ప మరొకరికి ఇచ్చే అవకాశం లేదనిపించే రీతిలో పాత్రకి న్యాయం చేసాడు. బాపు గారు బాలయ్య నుంచి అవసరమయిన నటనని రాబట్టుకోవటంలో ఘన విజయం సాధించారు. ఇది నిస్సందేహంగా బాలయ్య కెరీర్కే ఓ హైలైట్.  ఈ సినిమా నంది అవార్డులని స్వీప్ చేయటం ఖాయం.

సీతగా నయన తార తన పాత్రకి పూర్తి న్యాయం చేసినా, అందులో 50% నేరుగా అద్భుతంగా డబ్బింగ్ చెప్పిన సునీతకే చెందాలి. అదృష్టవశాత్తు ఈ సినిమాకి ఎక్కువ పాత్రల అవసరం లేకపోయిందిగానీ, ఆ స్థాయి నటన ప్రదర్శించగలిగే నటుల కరువు ప్రభావం మిగతా చిన్నాచితక పాత్రలలో కనపడుతూనే ఉన్నాయి. ఇక కళా దర్శకత్వం ఈ సినిమాకి మరో గొప్ప ప్లస్ పాయింట్. చాలా సహజమైన పనితనం అడుగడుగునా సెట్ల రూపంలో కనపడుతుంది.

ఇతర ముఖ్య పాత్రల విషయానికొస్తే, వాల్మీకిగా అక్కినేని తనకున్న పరిమితుల్లో ఏ లోటూ కనపడనీయలేదు. మురళీమోహన్ బానే అనిపించినా, కీ.శే.గుమ్మడి గారిని దశరథుడి పాత్రలో ఊహించుకోలేకుండా ఉండలేకపోయాను. బొత్తిగా పౌరాణిక వాసన లేని శ్రీకాంత్ ఆ మాత్రం లక్ష్మణుడిగా నటించటం, నా దృష్టిలో చాలా గొప్ప. బ్రహ్మానందం, ఝాన్సీ సరిపోయారు. కౌసల్యగా కే.ఆర్.విజయ సంపూర్ణ న్యాయం చేసింది. కౌసల్యగా మరెవరైనా నేటి తరంలో ఉన్నారా అని ప్రశ్నించుకుంటే, అంతకు మించి మరెవరూ నాకు గుర్తుకురాలేదు.

జొన్నవిత్తుల పాటల్లో సాహిత్యం కూడా వినసొంపుగా ఉంది. ఇళయరాజా సంగీతం గూర్చి చెప్పే పనిలేదు కానీ కుశలవుల "సీతారామ చరితం" పాటే కాస్త ఎందుకో తేలిపోయిందనిపించింది, దానికి తోడు ఆ పాటలో సాహిత్యంలో మరీ తేలిక తెలుగు పదాలు వాడాలన్న ప్రయత్నమో ఏమో తెలియదు కానీ మొత్తానికి కొద్దిగా నిరాశపరిచింది. బాలు గాత్రం ఇళయరాజా సంగీతానికి మరో ప్లస్సు. అలానే చిత్ర, శ్రేయా ఘోశాల్ ఇద్దరూ అద్భుతం. బాల హనుమాన్ పాట "రామ రామ..." పాట చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట. కుశలవులు మరియు బాల హనుమాన్ పాత్రధారులు మరో అద్భుతం. (కాకపోతే కోయబాలుడి రూపంలో ఉన్న హనుమాన్ కుశలవులతో పాటు తానూ ఎందుకు ఎదగలేదన్న ఓ కొంటె ప్రశ్న నాకు కలిగిందనుకోండి :-) ) అన్నిటికన్నా ముఖ్యంగా, ఈ తరానికి తగ్గట్టుగా ఎక్కడా విసుగనిపించకుండా కథని ముందుకు నడపటంలో బాపు మరియు రమణల సమిష్టి కృషిని మెచ్చుకోక తప్పదు.

మొత్తానికి బాలయ్య పౌరాణికాల్లో తండ్రి వారసత్వానికి ప్రతినిధినని నిరూపించుకున్నాడు. అసలు విషయం మరిచిపోయా, ఇంత గొప్ప సినిమాకి డబ్బులు పెట్టిన నిర్మాత సాయిబాబు గారిని అభినందించకపోతే అది పెద్ద తప్పే. మన కనీస కర్తవ్యం, నాలుగు డబ్బులు పెట్టి సినిమా చూసి రావటం. ఆయన కోసం కాకపోయినా, మన తెలుగు సినిమా కోసం.

ఓ పక్క గోకుడు, పీకుడు, పోకిరి ఇంకా కిరికిరీలని నెత్తినెక్కించుకుంటూ, మరో పక్క తెలుగు సినిమా అధోపాతాళానికి దిగజారిపోయిందంటూ దొంగ కన్నీరుతో బాధపడిపోయే ప్రతిఒక్కరూ చూసి ఆపై తమ అభిప్రాయాలు మార్చుకోవలసిన సినిమా ఇది. అలానే ఈ సినిమా మరో విడత పౌరాణికాలకి దారి చూపెడుతుందేమో వేచి చూడాలి.



పెళ్ళి కాని ప్రసాదు

పొద్దున్నే ఫోన్ రింగ్ రింగ్ మని మోగుతోంది...హలో.....ఎవరు?

నేనే బాబు ఆనంద్, ప్రసాద్ వాళ్ళ అమ్మని.

ఏమైంది ఆంటీ, పొద్దున్నే చేసారు?

మా ప్రసాదు నిన్న రాత్రి నుంచి గదిలోంచి బయటకి రాలేదు. పొద్దున్నే లేచి చూస్తే ఈ లెటర్ గది తలుపు దగ్గర పడుంది. అది చదివి వెంటనే నీకు ఫోన్ చేస్తున్నా బాబూ.

ఏం లెటరు? ఏం రాసాడు?

వాడికి జీవితం మీద విరక్తి పుట్టిందిట బాబూ, పోయే ముందు నిన్ను చివరిసారి కలిసి పోవాలని కోరికట. తొందరగా వచ్చి ఏదో ఒకటి చెయ్యి బాబూ, నాకు భయంగా ఉంది. ఈ నెలతక్కువ్వెధవ ఎప్పుడేంచేస్తాడో తెలీక చస్తున్నాం.

మీరేం భయపడకండి ఆంటీ, ఇదిగో ఇప్పుడే బయల్దేరివస్తున్నా అని ఫోన్ పెట్టేసా.

------------***-------------

ప్రసాదు గాడి ఇంటికెళ్ళి, వాడి గది తలుపు కొట్టి గట్టిగా పిలిచా.

తలుపు తీసి బెడ్ మీదెక్కి మళ్ళీ పడుకున్నాడు.

ఒరే ఏమైందో చెప్పిచావరా బాబూ?

ఆరోజు న్యూస్ పేపర్ నా మీదకి విసిరేసి, మళ్ళీ ముసుగు తన్నాడు.

వీడు కరెంట్ అఫైర్స్ చదివే కేసు కాదని, సినిమా సెక్షన్ తీసి చూస్తే "రాఖీ సావంత్ పెళ్ళి" అని కనపడింది. ఓస్ ఇదా వీడి బాధ అనుకొని....రేయ్ ప్రసాద్, రాఖీ సావంత్ పెళ్ళయితే ఇంతగా బాధపడాలిట్రా, మల్లికా శెరావత్ పెళ్ళి ఇంకా అవలేదులేరా.. మరీ ఓవర్ చెయ్యకుండా లేచి కూచో, అక్కడ నీకేదో అయిపోయిందని భయపడి చస్తున్నారా మీ వాళ్ళు.

రేయ్ నోర్ముయ్యరా, నాది మరీ అంత చెత్త టేస్ట్ కాదు. అసలు నాకు విరక్తి పుట్టింది అందుక్కాదు.

మరెందుకో చెప్పిచావరా?

ఒరేయ్,  నాకింక జీవితంలో పెళ్ళి కాదురా, ఇంక నేను బతకటం వేస్ట్ ... అని ఉన్నట్టుండి ఏడుస్తూ నా వొళ్ళో పడ్డాడు.

ఎందుకురా, నీకా డౌట్ ఎందుకొచ్చిందో చెప్పు.

ఈ న్యూస్ చూడ్రా, దేశంలో మెన్ టు విమెన్ రేషియో ఒకటి కన్నా తక్కువకి పడిపోయిందంటరా. అంటే నాకు చేసుకోటానికి పట్టుమని ఒక్క అమ్మాయి కూడా ఖచ్చితంగా లేనట్లురా. ఇన్నాళ్ళూ కో అంటే కోటి మంది అమ్మాయిలు నేను పిలవగానే పడొస్తారనుకున్నారా. ఇలా ఉన్నట్లుండి షాక్ ఇస్తే ఎలారా తట్టుకోవటం? అయినా ఇంత బతుకు బతికీ ఇంటెనకాల చచ్చినట్లు, ఇన్నాళ్ళు హీరోల్లా తిరిగి పెళ్ళి చేసుకోటానికి అమ్మాయి కూడా దొరకని పరిస్థితి కంటే పోవటమే మేలురా.

ఒరేయ్, నువ్వు నిజంగానే నెల తక్కువ వెధవ్విరా. ఆ రేషియోని మరీ అంత సీరియస్సుగా తీసుకోకూడదురా. ఉదాహరణకి, ఉన్న మగాళ్ళల్లో కొందరు ఆల్రెడీ పైకి పోయారనుకో, నీకు కాంపిటీషన్ తగ్గి ఇద్దరు అమ్మాయిలు దొరకొచ్చు. అలానే కొంతమంది మగవాళ్ళు సన్యాసుల్లో కలుస్తుంటారు, అప్పుడు కూడా నీకు రేషియో పెరుగుతుందిరా... నువ్వు మర్చిపోయినట్లున్నావు ఇదివరకు నిన్ను కాలేజ్లో మన ఫ్రెండ్ నిక్కీ చెప్పుతో కొట్టి తిరస్కరించిందే, అలా కొంతమంది మట్టికొట్టుకుపోతారు. సో బాధపడకురా...

శాడిస్టువి కాకపోతే ఇప్పుడు నాకా ఇన్సిడెంట్ పనిమాలా గుర్తుచెయ్యాల్రా. ఏంట్రా, అయినా నా పెళ్ళి కోసం ఎవడన్నా చస్తాడా, చెప్పు దెబ్బ తింటాడా లేదా సన్యాసుల్లో కలుస్తాడా అని ఎదురు చూడాల్రా. ఛీ..ఛీ.. అయినా ఒరేయ్ నీకీ బాధ అర్థం కాదురా. నాకూ నీలాగా బాల్య వివాహం నా మరదలితో అయ్యుంటే నేనూ ఇలా నీతులు చెప్పేవాణ్ణిరా. మా వాళ్ళు కట్నం కోసం కక్కుర్తి పడి నన్నిలా ముంచార్రా.

ఒరేయ్, నీ బొంద. తెలీకపోతే నోర్మూసుకో. నాకు అయింది బాల్య వివాహం కాదు, బాల్య నిశ్చితార్థం.

అదేలేరా.. ఒరేయ్, ఇంక నేనొక్క క్షణం కూడా ఆగేదిలేద్రా, నా పెళ్ళో చావో తేలాల్సిందేరా.

ఒరేయ్ పెళ్ళి కోసం చావకురా, నేను మీ వాళ్ళకి చెప్పి ఏదో చేస్తాలే అని వాణ్ణి ఓదార్చా.

------------***-------------

వీడికి ఇంత అర్జెంటుగా పిల్ల కావాలని మా ఇంట్లో డప్పెయ్యటం ఆలస్యం, మా పనిమనిషి యాదమ్మ వాళ్ళ చుట్టాల్లో ఓ పిల్ల ఉందని హైదరాబాదు అడ్రసిచ్చింది. ఎందుకైనా మంచిదని మా వాడికి వివరాలు చెప్పా.

అరేయ్, మరీ సిటీ పిల్లా? నసిగాడు మా వెధవ.

చూడు నాన్నా, "బెగ్గర్స్ కాంట్ బీ చూజర్స్" అని సామెత.  అంటే అడుక్కుతినే వెధవకి ఇష్టాలు కూడానా అని అర్ధం. కాబట్టి ఆ అమ్మాయి సిటీ పిల్లా, కోతి పిల్లా అన్నది నీకనవసరం.

ఒరేయ్, నాకా మాత్రం ఇంగ్లీష్ తెలీదనుకోకు, ఆ ఇంగ్లీష్ సామెతలో ఎక్కడా వెధవ, ఇష్టాలు కూ........డా.........నా........అన్న వెటకారాలేమీ లేవు.

అబ్బో, సెన్సెక్స్ అంటే బూతుపదమనుకునే స్థాయినుంచి బానే ఎదిగావురోయ్.. అయినా సిటీ ఆడపిల్లలని బెంబేలెత్తక్కర్లా, వాళ్ళ బిల్డప్పంతా పైపైనే.... ఇంటికెళ్తే అందులో నూటికి సగం అమ్మమ్మల టైపే. మనల నుంచి రక్షించుకోటానికి అలా చిర్రుబుర్రులాడుతూ ఉంటారు.

అయితే సరే, నాకు ఇంటికొచ్చాక చేతికి కాఫీ అందించే టైపే ఇష్టంరా...

అయితే ఇప్పుడే దేవుణ్ణి ప్రార్ధించుకో..ఆ మిగతా ఏభై మంది నీ చేత కాఫీ పెట్టించుకు తాగే రకం. నీ అదృష్టం ఎలా ఉందో...

ఏ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నావ్?

మా కులదైవం కృష్ణుణ్ణి.

నీ మొహం.. అయితే నీకు కాఫీ ఇచ్చేరకం గాదు, పెట్టించుకునే రకమే దొరుకుతుంది గ్యారంటీగా.
అదేంట్రా?

కృష్ణుడికి కాళ్ళు పట్టుకోవటమేగానీ పట్టించుకోవటం తెలియదు, మన పాలిటి దైవం ఎప్పుడూ ఆ విష్ణుమూర్తే. చక్కగా అలా కాళ్ళు పట్టించుకుంటూ కాఫీ, టీలు కూడా తాగుతుంటాడు. అన్నీ కుదిరితే నీకు జరగబోయేది కులాంతర వివాహం, అందుకు కులదైవం కాదు కులాంతర దైవమే బెటర్ నీకు.

ఒరేయ్ అసలు ముందు నువ్వు నా పాలిటి దేవుడివిరా, నా పళ్ళు నేను తోముకోవటమే మహా కష్టం అనిపించే నాకు, ఆ కాఫీ పెట్టించుకునే సీన్ తల్చుకుంటేనే భయమేస్తోంది.

------------***-------------

ఇద్దరం కలిసి హైదరాబాదు రైల్వే స్టేషన్ దిగి, సిటీ బస్సుకోసం నిలబడ్డాం. అంతలో ఓ బస్సొచ్చింది. దాని నంబరు 10D(4*6D/2)/+6D-2D అని రాసుంది. మా పక్కనే నిలబడ్డ పెద్దాయన్ని మా ప్రసాద్ గాడు ఈ బస్సు నంబరేంటి సార్? అని అడిగాడు.

ఏం వొళ్ళు తిమ్మిరిగా ఉందా? తాటికాయంత అక్షరాల్లో ఎదురుగా కనపడట్లా, అని కసిరాడు.

అంత కోపం ఎందుకు సార్, చిన్న డౌట్ క్లారిఫై చెయ్యమని అడిగితే అంత పెద్ద తిట్లా? అదేదో లెక్కలు లాగా ఉంటేనూ...

అవునయ్యా లెక్కలే, అయినా ఈ మాత్రం లెక్కలు రాకుండా హైదరాబాదులో ఏ మొహం పెట్టుకుని బస్సెక్కటానికొచ్చారయ్యా? అయినా తాటిచెట్టులా ఇంతెత్తెదిగావ్, ఆ మాత్రం లెక్కల్రావా?

వచ్చు సార్, కానీ ఫార్ములా ఎందుకు, నెంబరే రాయొచ్చు కదా? అదీగాక D ఏంటో తెలియలా? బిక్కమొహమేసి అడిగాడు.

ఏడిసావ్, D అంటే డే ఆఫ్ ద వీక్ అని అర్థం. సోమ=1,మంగళ=2...అలా... రోజును బట్టి దాని విలువ మారుతుంది. అది వెళ్ళే చోటు ఒకటే కానీ ఇదే బస్సు బోర్డ్ మార్చకుండా రోజూ వేరే వేరే రూట్లు మారుస్తూ పోతుంది. అయినా ఎందుకొస్తారయ్యా బాబూ...

ఈ హైదరాబాదు జనాలకి ఎంత ఎంసెట్ పిచ్చి ఉంటే మాత్రం, ఇలా మా జీవితాల్తో ఆడుకుంటార్రా.... ఒరేయ్, అసలే పెళ్ళవక నేను చస్తుంటే, ఇప్పుడు లెక్కలు కూడా నేర్చుకోవాల్రా...ఎంకమ్మ అని ఏడుపు లంకించుకున్నాడు.

వాణ్ణి ఓదార్చి, నేను నా మూడో క్లాసు లెక్కలు ఉపయోగించి  ఆ సోమవారం రోజు ఆ బస్సు నంబరు అరగంటలో తేలిగ్గా 124 అని కనిపెట్టా. మా ప్రసాద్ గాడి ఆనందంతో రెండు మూడు ఫీట్లు గాల్లో కొట్టి, "ఇది కల అని నేననుకోనా.. కలనైనా ఇది నిజమౌనా.." అని రాజ్ సీతారం గొంతుతో పాటెత్తుకుని, నన్ను కౌగిలించుకుని కాసేపు కరాళనృత్యం చేసాడు.

అంతలో ఓ ముష్టాడు మా వెనకాలే టక్కున బస్సెక్కి కూచున్నాడు.

బాబూ వీరముష్టి, ఈ బస్సు నంబరు నీకెలా తెల్సు. మేము చచ్చీ చెడీ కుస్తీ పడితేగానీ అర్ధం గాలా?

వాడో వెర్రి నవ్వు నవ్వి, ఇటు రాజీవ్ గాంధీ , అటు విమానం బొమ్మ ఉంటే అది  ఏర్ పోర్టు వెళ్ళే బస్సు. అందులో సీక్రెట్ ఏముంది అన్నా నా మొహం...

@#$%()* మరోమాట మాట్లాడకుండా ఇద్దరం నోర్మూసుక్కూచున్నాం.

------------***-------------

మొత్తమ్మీద ఎలాగో అమ్మాయి వాళ్ళ ఇంటికి చేరుకుని, తలుపు తట్టాం.

రండి, మీకోసమే చూస్తున్నాం బాబూ, ఇదేనా రావటం.

అబ్బే లేదండీ, నిన్న అర్ధరాత్రే వచ్చి ఆ మెట్ల కింద దాక్కున్నాం. మీరు లేచుంటారని ఇప్పుడే తలుపు కొట్టాం. అన్నాన్నేను.

వెటకారమా ...సంతోషించాం గానీ, అద్దె జోకులేనా, నీ సొంతం కూడా ఏవన్నా ఏడిసాయా. ఉంటే కాస్త విని తరిస్తాం."

మీరు పుట్టుకతోనే నవ్వు మొహంతో పుట్టారనుకుంటా..

నాకేసి పిచ్చ కోపంగా చూస్తూ... రండి అంటూ లోపలికి  వెళ్ళింది.

కాసేపట్లో తినటానికి అవీ ఇవీ తీసుకొచ్చి పెట్టారు. ఆ వెనకే అమ్మాయి వచ్చి కూచుంది.

హలో, మై నేమీజ్ జలజ. హౌ ఆర్ యూ?

అయాం ఫైన్, అన్నాడు మా వాడు.

మీ హాబీస్ ఏంటండీ?

వాచింగ్ మూవీస్, ప్లేయింగ్ వీడియో గేంస్..

మీ టూ, నాకూ మూవీస్ చూడటం చాలా ఇష్టం. లేటెస్టుగా ఏ మూవీ చూసారు?

"పరమవీరచక్ర.....ఐ లవ్ ఇట్. మూడు సార్లు చూసా." ప్రసాద్ గాడు ఏ మాత్రం లౌక్యం లేకుండా నిజం చెప్పేసాడు.

నేను ఏదో ఉపద్రవం రాబోతోందని అనుకునేలోపే...

"ఒసే జలజా, సంబడం చాలు గానీ..... వాళ్ళని బయటకి పంపి ఆ పళ్ళాళెత్తుకురావే లోపలికి" అని లోపల్నించి సూర్యకాంతం అరుపులు వినిపించాయ్.

కానీ అంతకన్నా ముందే అసలే రివటలా ఉన్న జలజ ఆ దెబ్బకి ఉన్నట్టుండి ఓ గావుకేక పెట్టి మూర్చపోయింది. లోపల్నించి సూర్యకాంతం పరిగెత్తుకొచ్చేలోపే మా వాణ్ణి తీసుకుని బయటికి పారిపోయా.

రేయ్, ఏంట్రా అసలు వాళ్ళు మనల్నెందుకు గెంటార్రా, ఏం తప్పు చేసామని? ఇంత అవమానించినందుకు వాళ్ళ మీద డెఫమేషన్ కేసేస్తా... చేసింది చేసి సిగ్గులేకుండా వాగుతున్నాడు.

ఛీ, అది నా నోటితో నేను చెప్పన్రా. అయినా నువ్వు ఇలానే ప్రవర్తిస్తే జలజే కాదురా, జాంబవతి కూడా నిన్ను పెళ్ళి చేసుకోదు. అసలు నాకు ఇప్పుడు అర్ధమయింది నీ ఖర్మ ఇలా ఎందుక్కాలిందో... ఒరే, తెలీకడుగుతున్నా, నువ్వు పోకిరి సినిమా చూసావట్రా ఇప్పటిదాకా?

లేదే, అదెప్పుడొచ్చింది?

అదీ సంగతి, అందుకే నువ్వెంత ఎదవ్వో నీకు ఇంతకాలం తెలియలా. అందులో హీరో కూడా నీ బాపతే. "నేనెంత ఎదవనో నాకే తెలియదు" అంటుంటాడు. కనీసం ఆ సినిమా చూసినప్పుడైనా ఆ ప్రశ్న నీకు నువ్వేసుకుంటే నీ మీద నీకో అభిప్రాయం ఏర్పడుతుందేమో అని ఓ చిన్ని ఆశ.. ఒరేయ్, అయినా 2011 లో పెళ్ళి చేసుకుంటూ నువ్వు చెప్పాల్సిన సినిమా పేర్లవి కావురా. అయినా ఇదేదో నా ఒక్కడి సొంత అభిప్రాయం కాదురా. అసలు ఆ అమ్మాయి దడుచుకోవటంలో తప్పులేదు. ఆ మధ్యన బెంగుళూరులో ఆ సినిమా విడుదలైనప్పుడు ఐదారు ప్రళయాలు కలిసి వచ్చినంత పనయ్యింది, భూకంపాలు, గాలి వానలు ఊరంతా చెల్లాచెదరైపోయింది అని ఒక సెలబ్రిటీ తన బ్లాగులో కూడా రాసుకున్నాడు. అలాంటి ఉపద్రవాలు తెచ్చే సినిమాలు చూస్తే చూసావులే గానీ, ఇలా బయటపెట్టి అభాసుపాలు కాబోకు మళ్ళీ. నీ ఇష్టాలతో ఇతరుల జీవితాల్తో ఆడుకునే హక్కు నీకు లేదు. పద ఇంటికి పోదాం.


పాత సామాను